
ఈ ప్రభుత్వ హయంలోనే అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంపుమినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేమహిళల్ని మహారాణులుగా చేయాల్లన్నదే ముఖ్యమంత్రి ధ్యేయంరాష్ట్ర మహిళా శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి
జియ్యమ్మవలస/పార్వతీపురం, /మనధ్యాస /నవంబర్ 24 : పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలని, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వన్ స్టాప్ సెంటర్ ఆవరణలో బేటీ బచావో... బేటీ పఢావో కార్యక్రమం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే కార్యకర్తల లక్ష్యమని అన్నారు.అలాగేఅంగన్వాడీ కార్యకర్తల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకే రూ. 250/-లతో ప్రారంభమైన కార్యకర్తల జీతాలు రూ. 2 వేలు నుంచి రూ. 11,500/-ల వరకు ఈ ప్రభుత్వ హయాంలోనే పెంచారని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలో 7వేల మినీ అంగన్వాడీలలో 5వేల అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చామని తెలిపారు. మిగిలిన 2 వేల మంది 10వ తరగతి ఉత్తీర్ణత కానందున మార్చలేదని చెప్పారు. ఇందుకు సిఎం ఏడాది పాటు గడువు ఇచ్చారాని, ఈలోగా వారందరూ 10వ తరగతి పాసైతే వారికీ పదోన్నతి కల్పిస్తామని అన్నారు. ఆ తర్వాత సూపర్వైజర్లుగా కూడా పదోన్నతి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 217 మందికి అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటి సౌకర్యం కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళ ఏ విషయంలోనూ తక్కువ కాదని గుర్తించి, మహిళలను మహారాణులుగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమని ఆమె పునరుద్ఘాటించారు. అర్హులకు ఆయాలుగా ఇస్తామని ఆమె అన్నారుజిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీల పనితీరు బాగుందని కితాబిచ్చారు. పిల్లల ఆరోగ్య, పౌష్టికాహారం, విద్య, పరిశుభ్రత పట్ల ప్రతీ కేంద్రంలోని కార్యకర్తకి బాధ్యత ఉందని గుర్తుచేశారు. జిల్లాలో కొన్ని కేంద్రాలు మినహా అన్నీ బాగా చేస్తున్నాయని, వారు కూడా పూర్తిస్థాయిలో అమలుచేసి ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లలకు మంచి అలవాట్లను ప్రాథమిక స్థాయి నుంచే నేర్పించాలని అన్నారు. ప్రతీ పిల్లవాన్ని శుభ్రత పట్ల నేర్చుకొని చేసుకోవడం అలవాటు కావాలని ఆదేశించారు. పిల్లల్లో అక్షరజ్ఞానంతో పాటు పరిశుభ్రత కూడా అంతే అవసరమని అన్నారు. పిల్లల ద్వారా తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ పిల్లలు ముందుండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి మాట్లాడుతూ జిల్లాలో 217 మందికి మినీ అంగన్వాడీ కార్యకర్తల నుంచి మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించి ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. ఒక విజన్ ఉన్న సిఎం మనకు ఉన్నారని, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది మాట్లాడుతూ పదోన్నతి పత్రాలు పొందుతున్న 217 మంది మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డైరెక్టర్ శేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి టి.కనకదుర్గ, డీసీపీఓ ఎ. సత్యనారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
