
కర్నూలు బస్సు ప్రమాదంలో వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన నలుగురు మృతి..!ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త ఇద్దరు పిల్లలు సజీవ దహనం..గోళ్ల వారి పల్లెలోని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..!జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మాట్లాడి, పార్దివ దేహాలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే.!బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొని సొంత కుటుంబంగా చూసుకుంటా .. ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
వింజమూరు అక్టోబర్ 24 (మన ధ్యాస న్యూస్)://
హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాద దుర్ఘటన.. దురదృష్టకరమని, అత్యంత బాధాకరమని, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన, గోళ్ల మాలకొండయ్య, సుశీల దంపతుల కుమారుడు గోళ్ల రమేష్(31) ఆయన భార్య అనూష (27) వారి కుమారుడు శశాంత్ (7) కుమార్తె మన్విత్ (4) బస్సు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, శుక్రవారం ఉదయం గోళ్ల వారిపల్లె గ్రామానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘటన ఎలా జరిగింది. కుటుంబ వివరాలను సేకరించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీతో ఫోన్ ద్వారా మాట్లాడి, డీఎన్ఏ టెస్టులకు సంబంధించి ఏర్పాట్లు చేసే విధంగా చూడాలని తెలిపారు. ఇక్కడ నుండి కర్నూలుకు పంపించేందుకు ప్రభుత్వ వాహనంతో పాటు, పోలీస్ కానిస్టేబుల్ ను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోళ్ళ మాలకొండయ్య, సుశీల దంపతుల, కుమారుడు, రమేష్ కోడలు అనూష ఇద్దరు పిల్లలు శశాంత్, మాన్విత్, ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాటులు చేసినట్లు తెలిపారు.

మాలకొండయ్య కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కాగా కుమారుని కుటుంబం మొత్తం నలుగురు బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. గోళ్ల మాలకొండయ్య కుమార్తె ధనమ్మ కుమార్తె అనూషను తమ కుమారుడు రమేష్ కు ఇచ్చి వివాహం చేసినట్లు తెలిపారు. ధనమ్మకు కూతురు కొడుకు ఉండగా, కొడుకు అనారోగ్యం కారణంతో చనిపోయాడని, ఇటీవల భర్త గుత్తా శ్రీనివాసులు చనిపోగా, ఈరోజు బస్సు ప్రమాదంలో కుమార్తె కూడా మృతి చెందినట్లు తెలిపారు. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా మరియు నేను సొంత కుటుంబం లాగా చూసుకుంటానని తెలిపారు. రమేష్ వ్యాపార రీత్యా బెంగళూరులో ఉండగా, దీపావళికి సొంత గ్రామానికి వచ్చి, దీపావళి పండుగ చేసుకొని వెళ్లారని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం, అత్యంత బాధాకరమన్నారు. దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రమేష్, కుటుంబంతో కలిసి, ఈ కుటుంబం, టూర్ కు వెళ్లారని, టూరు ముగించుకొని బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కొత్తపేటకు చెందిన రమేష్ భార్య ఇద్దరు బిడ్డలు బస్సులో నుండి దూకారని, వీరిని కూడా కాపాడే క్రమంలో, ఒక్కసారిగా బస్సులో తొక్కిసలాట జరగడంతో కాపాడలేకపోయినట్లు రమేష్ తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,యువ నాయకుడు మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిగిన బస్సు ప్రమాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, వారితో కూడా నేను మాట్లాడడం జరిగిందని, కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. విషాదఛాయలు అలుముకున్నాయి.కుటుంబాన్ని పరామర్శించిన వారిలో, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, చాకలి కొండ గ్రామ నాయకులు, స్థానిక నాయకులు ఉన్నారు.
