
పాలసముద్రం, మన ధ్యాస, అక్టోబర్ 23: పాలసముద్రం మండలంలో ప్రజల సేవకే ప్రాధాన్యతనిస్తూ, అవినీతి అక్రమాలకు సహకరించని తహసీల్దార్ (మండల మేజిస్ట్రేట్) అరుణకుమారిని కూటమి నాయకులు బదిలీ చేయించారని సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన ఈ అధికారి నిజాయితీ, క్రమశిక్షణతో ప్రజల్లో మంచి పేరు సంపాదించారు.గత సాధారణ ఎన్నికల అనంతరం సాధారణ బదిలీల్లో పాలసముద్రం మండలానికి తహసీల్దార్‌గా నియమితులైన అరుణకుమారి, పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాజకీయ సిఫార్సుల కంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, రెవెన్యూ సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ పలు సమస్యలను పరిష్కరించారు.ఇదే విషయం కొంతమంది స్థానిక కూటమి నాయకులకు నచ్చక, ఆమెపై అసత్య ఆరోపణలు చేస్తూ బదిలీకి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. రాజకీయ నాయకుల సిఫార్సుపై ఇచ్చిన ఫైళ్లను చట్టబద్ధత లేనందున తిరస్కరించడం, వీరికి కాస్త అసహనాన్ని కలిగించింది.గ్రావెల్ తరలింపుకు అడ్డంకి – కొత్త క్వారీ అనుమతులకు నిరాకరణపాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రెవెన్యూ భూముల్లో క్వారీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడి నుండి అక్రమంగా తమిళనాడుకు గ్రావెల్ తరలింపును గుర్తించిన తహసీల్దార్ అరుణకుమారి, వాటికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వం నష్టపోకుండా చర్యలు చేపట్టారు.ఇదే సమయంలో, కొత్తగా వచ్చిన 23 క్వారీ అనుమతుల దరఖాస్తులను చట్టబద్ధత లేకపోవడంతో ఆమె పెండింగ్‌లో ఉంచారు. ఈ నిర్ణయంపై కొంతమంది కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.అంతేకాకుండా మండలంలోని గ్యాప్ ఏరియా ప్రభుత్వ భూములను తమ పార్టీ అనుచరులకు కేటాయించాలని కూటమి నాయకులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఆమె ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం.నిజాయితీకి బదిలీ బహుమతితహసీల్దార్ అరుణకుమారి చట్టబద్ధంగా పనిచేసినందుకు, అవినీతి లాబీలకు సహకరించని కారణంగా కొంతమంది కూటమి నాయకులు మంత్రులను సంప్రదించి ఆమె బదిలీని సాధించారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజలకు సేవచేసే అధికారిని రాజకీయంగా వేధించడం విచారకరం అని పలువురు స్థానికులు అభిప్రాయపడ్డారు.ప్రజల అభిప్రాయం ప్రకారం, “ఇలాంటి నిజాయితీ గల అధికారులను ప్రోత్సహించాలి కాని బదిలీలతో బెదిరించడం తగదు” అని పలువురు మండల ప్రజలు పేర్కొన్నారు.