
మన ధ్యాస సాలూరు:- పాచిపెంట, సాలూరు మండలాల్లో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్, ఇంచార్జి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం పాల్గొని, ఆకస్మిక తనిఖీ చేశారు. పాచిపెంట మండలం సరాయివలస, కొటికిపెంటల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) లను జేసీ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పాఠశాల ప్రాంగణంలోని పారిశుధ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, వంటగది, భోజన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈ ప్రాంతాలన్నీ ఎల్లపుడు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించిన ఆయన వారి విద్యా ప్రమాణాలను సమీక్షించారు. అలాగే నిర్మాణ దశలో ఉన్న EMRS పనులను తనిఖీ చేశారు. అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ రికార్డులు, పీజీఆర్ఎస్ దరఖాస్తులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. స్థానిక రెవెన్యూ సమస్యలను సమీక్షించిన జేసీ త్వరగా పరిష్కారం చేసేందుకు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. సాలూరు మండలం కూర్మరాజుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని తనిఖీ చేసి, ఎం-బుక్ ప్రకారం నాణ్యత మరియు కొలతలను తనిఖీ చేసి ధృవీకరించారు. అదే గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ఈ-పంట రికార్డులు మరియు సంబంధిత ఆన్లైన్ రికార్డులపై సమీక్షించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ఆహార సరఫరా నాణ్యత మరియు పరిమాణాన్ని తనిఖీ చేశారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని సంక్షేమ మరియు అభివృద్ధి పనులలో నాణ్యత, పారదర్శకత ఉండాలని అన్నారు. సకాలంలో పనులన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు పాచిపెంట మండలం సరాయివలస లోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు మౌలిక వసతుల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులపై మంత్రికి వివరించారు. ఈ పర్యటనలో ఐటిడిఏ డిఈఈ బలివాడ సంతోష్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు,