మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, టి యు సి ఐ మణుగూరు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు వి. జానయ్య, పి. సంజీవరెడ్డి లు మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంపుదల చేయాలని డిమాండ్ చేస్తూ, యూనియన్ రాష్ట్ర కమిటీ దశల వారి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని, యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేతనాల పెంపుదలకు కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులే లేరని అన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని లాభాల వాటా 5000 రూపాయలు చెల్లించడం హర్షించదగ్గ విషయమే అని అన్నారు. అదేవిధంగా వేతనాల పెంపుదల పట్ల కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి వేతనాలు పెంచాలని కోరారు. ఈనెల తొమ్మిది నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతనాల గురించి చర్చ జరిగే విధంగా స్థానిక శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు కృషి చేయాలని కోరారు. సింగరేణిలో ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లలో కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అమలు కావడం లేదన్నారు. అమలు అయ్యే విధంగా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వము, సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో బలమైన కార్మిక పోరాటాలకు, ఉద్యమాలకు సిద్ధం కావాలని కాంట్రాక్ట్ కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్ తదితరులు పాల్గొన్నారు.