
పెనుమూరు, మన ధ్యాస , అక్టోబర్ 16 :
చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రమైన పెనుమూరులో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ అభివృద్ధి దిశగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆయన గురువారం రాసిన లేఖలో వివరాలు వెల్లడించారు. బస్టాండు నుంచి సంతగేటు, హై స్కూలు, ప్రాధమిక పాఠశాల, బజారు మీదుగా కార్వేటినగరం వైపు బస్సులు వెళ్లడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్టాండు తూర్పు వైపు నుంచి బజారు అవతల ఉన్న కార్వేటినగరం రహదారి వరకు సుమారు అర కిలోమీటరు (0.5 కి.మీ) మేర బైపాస్ రోడ్డు నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఇప్పటికే బస్టాండు నుంచి దాదాపు 150 మీటర్ల రహదారి ఉందని, మిగతా 500 మీటర్ల నిర్మాణం చేస్తే సరిపోతుందని తెలిపారు. ఈ మార్గం మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచి ఉందని, పెనుమూరు తహసీల్దారు ఆరు నెలల క్రితం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారని గుర్తు చేశారు. గతంలో ఈ దారిలో రాకపోకలు జరిగేవని, అయితే ఒక వైసిపి నేత కుటుంబ సభ్యులు వంక, కమ్మవారి మిట్ట (గాండ్ల వారి మిట్ట) కలిపి సుమారు 2.5 ఎకరాల భూమిని ఆక్రమించి దారిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.అధికారులపై వత్తిడి తెచ్చి రహదారి పనులు నిలిపివేస్తున్నారని డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినా వైసిపి నేతల పెత్తనం కొనసాగుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టి పెనుమూరు ప్రజల సమస్యలను పరిష్కరించాలని, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు.