
చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 14:- చిత్తూరు జిల్లా, పెనుమూరులో ఆరు పంచాయతీ గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కలెక్టర్ కు పంపిన లేఖలో ఒక వ్యక్తి ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా గదులను ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. దీనివల్ల పంచాయతీకి రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. పెనుమూరు గ్రామ పంచాయతీ వారు 2007 లో ఎంపీ నిధులతో సంత గేటులో ఆరు గదులు నిర్మించారని తెలిపారు. అయితే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో కొందరు సదరు గదులను అక్రమంగా స్వాధీనంలో ఉంచుకుని పంచాయతీ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. స్థానికుల ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు, జిల్లా పంచాయతీ అధికారి చొరవతో ఈ నెల 22 వ తేదీ బహిరంగ వేలం నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే అధికారులు ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గదులలో మూడు గదులను ఒక వ్యక్తి స్వాధీనంలో ఉంచుకుని అద్దెకు ఇచ్చారని చెప్పారు. అలాగే అతను మరో మూడు గదులను పంచాయతీ నుంచి నామ మాత్రపు ధరకు తీసుకుని అధిక ధరకు అద్దెకు ఇచ్చారు. దీని వల్ల పంచాయతీకి రూ. 50 లక్షలు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఈ నేపధ్యంలో గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, నష్ట పరిహారం వసూలు చేయాలని కోరారు. ఇన్నాళ్లు నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ గదుల వేలం పారదర్శకంగా నిర్వహించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు . గతంలో బస్టాండు కాంప్లెక్స్ లోని 22 గదుల వేలంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, కొందరు హై కోర్టులో స్టే తెచ్చారని గుర్తు చేశారు.దీనివల్ల పంచాయతీకి నెలకు మూడు లక్షలు నష్టం వస్తోందని పేర్కొన్నారు. ఆరు గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి నష్ట పరిహారం వసూలు చేయాలని కోరారు.
