
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్ నగర్ మండల విద్యా అధికారిగా (ఎంఈఓ) వెంకటేశ్వర్లు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన ఎంఈఓ అమర్ సింగ్ గత నెలలో పదవీ విరమణ చేయగా, వారి స్థానంలో సింగీతం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లును నియమిస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- మండలంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తానని, పాఠశాలల్లో విద్యార్థుల శాతం పెంపు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం,మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందేలా కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహమ్మద్ నగర్ మండల పీఆర్టీయూ ఆధ్వర్యంలో కొత్త ఎంఈఓ వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించారు.పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ కొత్త ఎంఈఓ నియామకం మండలానికి శుభపరిణామమని అభివర్ణించారు. విద్యా అభివృద్ధిలో వెంకటేశ్వర్లు సానుకూల మార్పులు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్,శ్రీనివాస్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.