
సమ్మిళిత విద్య మరియు ఆటిజం కేంద్రాలపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సలహా కమిటీ తొలి సమావేశం..,.
విజయవాడ సెప్టెంబర్ 27 (మన ధ్యాస న్యూస్):///
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సలహా కమిటీ ఆధ్వర్యంలో సమ్మిళిత విద్య (Inclusive Education) మరియు ఆటిజం కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు విజయవాడలోని పటమటలో ఉన్న సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర విద్యను మరింత బలోపేతం చేయడం, ఆటిజం కేంద్రాల పనితీరును మెరుగుపరచడం, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మెరుగైన సదుపాయాలు అందించడం వంటి అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి.కమిటీ సభ్యులంతా కలిసి ఈ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు సమగ్ర విద్యకు సంబంధించిన కార్యకలాపాలను వివరంగా సమీక్షించి, ఈ రంగంలో మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరాన్ని గుర్తించారు. విద్యలో సమానత్వం, ప్రత్యేక శిక్షణా పద్ధతులు, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, ఆటిజం పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు వంటి అంశాలపై ఆయన స్పష్టమైన చర్చ నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అందరూ కలిసి సమగ్ర విద్యా విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలను సూచించారు.