
నెల్లూరు సెప్టెంబర్ 26 :(మనధ్యాసన్యూస్)ప్రతినిధి, నాగరాజు:///
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు ఆధ్వర్యంలో సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులకు మినుము పంటలో అనుసరించవలసిన మెరుగైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చి, తరువాత మినుము రకం, ఎల్ బి జి -904 విత్తనాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా. లలిత శివజ్యోతి గారు మాట్లాడుతూ – ఈ కార్యక్రమం ఉద్దేశం రైతుల పాలలో ఉన్న యాజమాన్య పద్ధతులను మెరుగైన పద్ధతులతో పోల్చి చూపించడం,అలాగే ఆ ప్రాంతానికి అనువైన కొత్త రకాల పంటలను పరిచయం చేయడం అని తెలిపారు.విస్తరణ విభాగ శాస్త్రవేత్త డా. ఎస్. లోకేష్ బాబు గారు మాట్లాడుతూ – ఎల్ బీ జి -904 మినుము రకం 2023లో విడుదలైనదని, ఇది 85–90 రోజుల్లో కోతకు వచ్చే పంట అని, పల్లాకు తెగుళ్లను తట్టుకోగలదని చెప్పారు. పాలిష్ రకంగా ఉండే ఈ మినుము అన్ని కాలాలకు అనువైనదని వివరించారు. అలాగే విత్తనాన్ని విత్తే ముందు ప్రతి కిలోకు మాంకోజెబ్ లేదా కర్బెండాజిమ్ 2.5 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ లేదా థియోమెథొక్సమ్ 5 గ్రాములు కలిపితే 15–20 రోజులు తెగుళ్లు, రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ లభిస్తుందని సూచించారు.అంతేకాకుండా ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించుకోవాలని, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరులో భూసార పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా కుమారి పి. అనూషా గారు కూడా రైతులతో చర్చించారు.