మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారు తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.ముందుగా ఎన్.ఎస్.పీ. గెస్ట్ హౌస్ వద్దకు వచ్చిన కలెక్టర్‌కు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డీఆర్వో బి. చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డితో పాటు ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రకాశం భవనానికి చేరుకున్న కలెక్టర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు జిల్లాలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేస్తూ, పాలిటికల్ గవర్నెన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తానని, “పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదు” అని స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.అలాగే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తానని తెలిపారు.తరువాత, పలువురు జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.