
యాదమరి, సెప్టెంబర్ 8 (మన ధ్యాస) :
యాదమరి మండలంలో ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను సంఘ ప్రతినిధులు సేకరించారు. ఈ సందర్భంలో ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న 4 డి.ఎ.లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 12వ పీఆర్సీకి సంబంధించి తక్షణమే కమిషన్ చైర్‌పర్సన్‌ను నియమించి, ఆలస్యమైన మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేయాలని, పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు వెంటనే అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన 30 వేల కోట్ల బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ యాదమరి మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పిళ్ళే, సంఘ నాయకులు గుణశేఖరన్, గణపతి, ఎస్.ఎన్. భాషా, మణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.