వెదురుకుప్పం,మన ధ్యాస, సెప్టెంబర్ 7 :
జి డి నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ క్వారీల ఆటలు సాగనివ్వమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. నియోజక వర్గంలో కొందరు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం వెదురుకుప్పం మండలం కొమరికుంట పంచాయతీ బందార్లపల్లి గ్రామస్తులపై క్వారీ యాజమాన్యం దౌర్జన్యం చేయడం అత్యంత కిరాతక చర్య అని అన్నారు. క్వారీ యాజమాన్యంపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కూడా రైతులకు అండగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు తావులేదని చెప్పారు. నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమాలను ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మంత్రి అనిత దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు. కాగా రైతులు విజ్ఞప్తులను కాదని క్వారీ యజమానికి అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతుల పట్టా భూముల్లో అక్రమంగా ప్రవేశించి దారి ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం అన్నారు. అక్రమంగా రైతుల భూముల్లో ప్రవేశించిన క్వారీ యాజమాన్యాన్ని వదిలి పెట్టి అడ్డుకున్న రైతులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడం వెనుక ఎవరి ఒత్తిడి, హస్తం ఉందో పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
గ్రామాల సమీపంలో క్వారీలకు అనుమతి ఇవ్వడం, గ్రామాల మద్యలో టిప్పర్లు ట్రాక్టర్లతో గ్రానైట్ తోలడం చట్ట విరుద్ధం అన్నారు. నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమాలను పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తానని సుధాకర్ రెడ్డి తెలిపారు.