మన న్యూస్: మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమిస్కిల్డ్ వేతనాలు చెల్లించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్,(టి యు సి ఐ )మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు వీ. జానయ్య సింగరేణి యాజమాన్యాన్ని ,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశల వారి ఆందోళన పిలుపులో భాగంగా మంగళవారం యూనియన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మణుగూరు కే సి హెచ్ పి, డివైజియం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నప్పటికీ, వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా, చాలీ చాలని వేతనాలు చెల్లిస్తూ, వారి శ్రమను కారు చౌకగా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. చాలీ,చాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమై కాంట్రాక్ట్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ క్లీనింగ్ కార్మికులు ఎత్తయిన ప్రదేశంలో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ, వారికి సెమిస్కిల్డ్ వేతనాలు చెల్లించవలసి ఉన్నప్పటికీ, హౌస్ కీపింగ్ టెండర్ల పేరుతో అన్ స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తున్నారని విమర్శించారు. కొన్ని డిపార్ట్మెంట్లలో నేటికీ కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అమలు కావడం లేదన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని, బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమిస్కిల్డ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అమలు కాని డిపార్ట్మెంట్లలో అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కే సి హెచ్ పి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.