మన ధ్యాస కాణిపాకం సెప్టెంబర్-3 చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దివ్యరథాన్ని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. ఉత్సవమూర్తి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం మహారథంపై ప్రతిష్టించారు. వేదమంత్రోచ్చరణలు, మంగళవాద్యాల మధ్య భక్తులు “జై భోలో గణేష్ మహరాజ్ కి జై” అంటూ రథాన్ని లాగారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తజనుల హర్షధ్వనులతో మార్మోగింది.
రథయాత్ర వీధులంతా భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు మంగళహారతులు పట్టి స్వామివారికి ఆరతులు చూపగా, ఆ గణ నాధుడు భక్తుల హారతులు స్వీకరిస్తూ రధం పై ముందుకు సాగారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ పెంచాల కిశోర్ పుతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళి మోహన్ మాట్లాడుతూ – బ్రహ్మోత్సవాలు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి కాణిపాక గణనాథుని కృప పొందేలా ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.