మన ధ్యాస, నిజాంసాగర్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి, రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరా నదిలోకి 1,00,243 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ ఉమ్మడి జిల్లాల వరప్రదాయినిగా నిలిచిందని, ఇది ప్రపంచంలోనే ప్రాముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటని తెలిపారు. మొదట్లో నీటి కొరతతో రైతులు ఆందోళన చెందారని, అయితే దేవుని కృపతో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. వానకాలం పంటలతో పాటు రాబోయే వ్యాసంగి పంటలకు కూడా నీరు సమృద్ధిగా ఉందని, రైతులు నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. యూరియా సమస్యపై మాట్లాడుతూ.. కేంద్రం నుంచి కావలసినంత యూరియా సరఫరా ఆలస్యమవుతుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తోందని చెప్పారు. ముందుగా వరి నాట్లు వేసే నిజాంసాగర్, బాన్సువాడ, ఎడపల్లి, బోధన్, వర్ని ప్రాంతాల్లో రైతులు ముందుగానే యూరియాను సేకరించుకోవడంతో పెద్ద సమస్యలు రాలేదని వివరించారు. తాజా వర్షాల కారణంగా కొంతమంది రైతులు నష్టపోయిన విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందని, అధికారులు సక్రమంగా వివరాలు సేకరించి లబ్ధి చేకూర్చేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్శనలో జంగం గంగాధర్, నార్ల సురేష్, ఎజాస్, ఆర్.కే. రామకృష్ణ, సయ్యద్ రజావుల్లా, మోహన్ నాయక్, నీటిపారుదల శాఖ ఏఈలు సాకేత్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు