నెల్లూరు మనద్యాస,న్యూస్ ప్రతినిధి నాగరాజు : సెప్టెంబర్ 1:///
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డా. జి. శివనారాయణ సోమవారం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు రూపొందించిన సాంకేతిక కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న సేవలు, శిక్షణా కార్యక్రమాలు మరియు విస్తరణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. డైరెక్టర్ గారు మాట్లాడుతూ, “రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే ఆధునిక సాంకేతికతను సమయానికి అందించడం అత్యవసరం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు ఉపయోగపడేలా మరిన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయాలి. పంటల వైవిధ్యకరణ, విలువ వృద్ధి, మార్కెటింగ్ లింకేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని సూచించారు. అలాగే NFDB ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, శిక్షణార్థులతో మమేకమై వారి అభిప్రాయాలను విన్నారు. శిక్షణ పొందిన రైతులు, మత్స్యకారులు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి శిక్షణలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సాంకేతికతను నేర్చుకొని మా వృత్తి అభివృద్ధికి వినియోగించుకుంటున్నాం” అని తెలిపారు. తరువాత డైరెక్టర్ గారు కృషి విజ్ఞాన కేంద్రంలోని ప్రదర్శన యూనిట్లను పరిశీలించారు. పంటల విభాగం, పౌల్ట్రీ, మత్స్య పెంపకం, తేనేటీగల పెంపకం, వర్మీ కంపోస్ట్ యూనిట్లు వంటి విభాగాల్లో ఏర్పాటు చేసిన డెమో యూనిట్లను సందర్శించి, “రైతులకు ప్రత్యక్షంగా చూపించడం వలన సాంకేతికతపై అవగాహన పెరుగుతుంది. వీటిని మరింత ప్రభావవంతంగా అమలు చేయాలి” అని అన్నారు. ఈ సందర్బంగా ఎస్ సీ ఎస్ పి లబ్ధిదారులకు సికేచర్స్, ఇన్క్యుబేటర్లు, స్ప్రేయర్లు, మరియు ఇతర వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ పరికరాలను స్వీకరించిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, “ఈ పరికరాలు మాకు ఉత్పత్తి పెంపుకు, శ్రమ తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి సహకారం వల్ల గ్రామీణ యువత కూడా వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం పొందుతుంది” అని అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ గారు అదనంగా, డిజిటల్ ఎక్స్టెన్షన్ సేవలు, మొబైల్ యాప్ల ద్వారా రైతులకు సలహాలు, వాతావరణ సూచనలు, మరియు మార్కెట్ సమాచారం అందించడంపై కూడా చర్చించారు. రైతులు మార్కెట్లో మెరుగైన ధరలు పొందేందుకు ఎఫ్ పి ఓ ల (Farmer Producer Organizations) ను బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కేవీక్ శాస్త్రవేత్తలు, సిబ్బంది, రైతులు, మహిళా సంఘాలు, యువకులు పాల్గొన్నారు.