మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం సెప్టెంబర్-1 రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తెచ్చిన పధకాలు, కార్యక్రమాలు, సంస్కరణలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో *"పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్"* మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం తొలిసారి సీఎంగా ఇదే రోజు బాధ్యతలు చేపట్టారని, తరువాత మూడు దశాబ్దాల కాలంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి అద్భుతమైన మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు తెచ్చిన పథకాలు, కార్యక్రమాలు, సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేశాయని చెప్పారు. దేశంలోనే సంచలనం కలిగించిన ప్రజల వద్ద పాలన ద్వారా పారదర్శకతకు శ్రీకారం చుట్టారని, ప్రజల భాగస్వామ్యానికి నాంది పలికిన జన్మభూమి కార్యక్రమం, ప్రజా చైతన్యాన్ని మేల్కొలిపిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఆయన దూరదృష్టికి నిదర్శనం అని తెలియజేశారు. బాలిక విద్యకు ఆయన అధిక ప్రాధాన్యత కల్పించారని, బీసీలకు ఆదరణ పథకం, ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ అమలు, మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి వర్గాన్ని ముందుకు నడిపించారని వివరించారు. మహిళల సాధికారత కోసం తొలిసారి డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచారని, విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి అద్భుతమైన ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో తొలి విమానాశ్రయాన్ని తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు బాటలు వేసారని, టెలికాం రంగ సంస్కరణలకు ఆయన చేసిన సూచనలు దేశవ్యాప్తంగా మార్పులు తెచ్చినట్లు చెప్పారు. పీపీపీ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం, ప్రతి గ్రామానికి రోడ్ల సౌకర్యం, ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ హైటెక్ సిటీ నిర్మాణం, పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల స్థాపన వంటి నిర్ణయాలు యువతకు అపారమైన అవకాశాలను సృష్టించాయన్నారు. విజన్ 2020 ద్వారా పాలనకు కొత్త రూపు ఇచ్చారని, 1.80 లక్షల టీచర్ల నియామకం చేసి విద్యారంగానికి పునాదులు వేశారని, నాలెడ్జ్ ఎకనామీకి మార్గం సుగమం చేశారని తెలియజేశారు. దేవాలయాల పరిరక్షణ, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని, డిజిటల్ గవర్నెన్స్‌తో సేవలను సులభతరం చేసి, డిజిటల్ కరెన్సీ కమిటీ, స్వచ్ఛ భారత్ కమిటీకి నేతృత్వం వహించినట్లు తెలిపారు. రైతుల కోసం అన్న క్యాంటీన్లు, డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ, సబ్సిడీలు, యాంత్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం వంటి ఆవిష్కరణలు చేసి వ్యవసాయ రంగానికి బలం చేకూర్చారు. అట్టడుగు వర్గాల కోసం ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పారదర్శక పాలన అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గుర్తింపు ఇవ్వడానికి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టారు. పేదరిక నిర్మూలనకు పి4 కార్యక్రమం ప్రారంభించి బలహీన వర్గాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళలో అతికీలకమైన పథకాలు, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధికి మైలురాళ్లుగా నిలిచిందన్నారు. నేటి తరాలకు మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా నారా చంద్రబాబునాయుడు ప్రేరణగా నిలుస్తారు” అని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు.