మన ధ్యాస చిత్తూర్ ఆగస్ట్-28 డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఎంపిక జాబితాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. చిత్తూరు అపోలో విశ్వవిద్యాలయం, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలలో జరుగుతున్న ధృవపత్రాల పరిశీలన కేంద్రాలలో నూతన ఉపాధ్యాయ అభ్యర్థులకు సంఘం తరఫున ఆత్మీయ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎన్.ఆర్. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ “గతంలో ప్రతి డీఎస్సీలో రాత పరీక్ష ఫలితాలను ప్రకటించి, వాటి ఆధారంగా ప్రతీ జిల్లాకు ప్రత్యేకంగా ఎంపిక జాబితాలు విడుదల చేసేవారు. అందువల్ల ప్రతి వర్గంలో ఎంత వరకు అర్హత సాధించారో స్పష్టంగా తెలిసేది. కానీ ప్రస్తుతం విద్యాశాఖ నేరుగా అభ్యర్థులకు కాల్ లెటర్ సందేశాలు పంపడం వల్ల గందరగోళం ఏర్పడుతోంది. ఎంపిక జాబితాలో ఉన్నప్పటికీ కొంతమంది అభ్యర్థులకు కాల్ లెటర్లు రాకపోవడం వల్ల వారు ధృవపత్రాల పరిశీలన కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వెంటనే జిల్లాల వారీగా డీఎస్సీ ఎంపిక జాబితాలను విడుదల చేయాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గుణశేఖరన్ తో పాటు అనేకమంది డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.