మన ధ్యాస, కోవూరు, ఆగస్టు 25 :స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మనది- దేశంలో ఎక్కడా లేనివిధంగా స్మార్ట్ కార్డుల పంపిణీ .కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేలా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. సోమవారం కోవూరు పంచాయతీలోని పెల్లకూరుకాలనీలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారికి ప్రభుత్వం తరఫున అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ... ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశంలో ఎక్కడా లేనివిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి నాలుగు దశల్లో క్యూఆర్ కోడ్ తో కూడిన 1 కోటి 45 లక్షల స్మార్ట్ రేషన్ కార్డుల ను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగా రేషన్ సరఫరాలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేలా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని వివరించారు. జిల్లాలో 7.10 లక్షల కార్డులు వచ్చాయని వివరించారు. కోవూరు నియోజకవర్గంలో 95 వేల రేషన్ కార్డులకు గాను 94 వేల స్మార్ట్ కార్డ్స్ కార్డులు వచ్చాయని వివరించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం 199 రేషన్ షాపులు ఉన్నాయని, ప్రజల అవసరాలను దృష్టితో వీటి సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎవరికైనా రేషన్ కార్డులు అందకపోతే సమీప సచివాలయంలో సంప్రదించి తీసుకోవాలని సూచించారు. అధికారులు స్మార్ట్ కార్డుల వినియోగంపై రేషన్ డీలర్లకు సరైన అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోవూరు సర్పంచ్ విజయమ్మ, పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి నాయకులు ఇంతా మల్లారెడ్డి, కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.