మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-20
పూతలపట్టు మండలం, పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పేటమిట్ట అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు నిర్వహించిన జాబ్ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన స్ధానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ని స్ధానిక నాయకులు, అమరరాజా ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులు దుశ్శాలువలు, పూలమాలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్యే మాట్లాడి విద్య, నైపుణ్యం తగినట్టు ఉద్యోగం కల్పించాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి వివిధ కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తూనే మరొ వైపు జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని చదువుకున్న యువతీ, యువకులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జాబ్ మేళాలో ఉద్యోగం పొందని నిరుద్యోగులకు కోసం త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కల్పించి జాబ్ మేళాను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ బాబు, బంగారుపాలెం మండల అధ్యక్షులు ఎన్ పి ధరణి నాయుడు, బంగారుపాలెం మార్కెట్ డైరెక్టర్ గురుస్వామి మరియు అమర్ రాజా ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, యువతీ, యువకులు పాల్గొన్నారు.