మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):
ప్రపంచంలోనే అతి భారీ నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన నిజాంసాగర్ ప్రాజెక్టులో 36 సంవత్సరాల తర్వాత మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం ఆరేడు గ్రామ శివారులోని 20 గేట్లలో 12, 13 నంబర్ గేట్లను ఎత్తివేసి 6 వేల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేశారు.నీటి పారుదల శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 1988లో చివరిసారిగా ఈ 20 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రాజెక్టుకు అలాంటి వరద రాలేదు. అయితే ఈసారి మంజీరా నదికి ఎగువభాగంలో కురుస్తున్న వర్షాల వలన భారీగా నీరు వచ్చి చేరడంతో గేట్ల ఎత్తివేతకు దారితీసింది.ప్రస్తుతం ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దానిని వీఆర్ నెంబర్-5లోని 7 గేట్ల ద్వారా, వీఆర్ నెంబర్-6లోని 8 గేట్ల ద్వారా మొత్తం 85 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు.
ఈ చారిత్రాత్మక దృశ్యం చూడటానికి స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు తండోపాలుగా తరలివచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 12, 16, 20 నంబర్ గేట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరంమీడియాతోమాట్లాడుతూ –వరుసగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదు అని సూచించారు.కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి ప్రమీల,తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, నీటిపారుదల శాఖ ఈఈ సులేమాన్, ఏఈలు సాకేత్, శివప్రసాద్, అక్షయ్, తదితరులు ఉన్నారు.