మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం మక్తల్ మండలంలోని కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టుపై పారుతున్న వరద నీటి ప్రవాహాన్ని ఆమె పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో కర్నీ గ్రామానికి ఎగువ ప్రాంతంలో ఉన్న టేకుల పల్లి, రుద్ర సముద్రం, గొల్ల పల్లి, ఖానాపూర్ గ్రామాల చెరువులు నిండి అలుగు పరూతున్నాయని, ఆయా చెరువుల అలుగు నీరు కర్నీ గ్రామ కల్వర్టుపై కి చేరి మోకాళ్ళ లోతు వరకు ఉదృతంగా పారుతోందని, ఇలాంటి సమయంలో అటు వైపు ఉన్న గ్రామాల ప్రజలు ఇటు ( మక్తల్) వైపు రావడం ప్రమాదకరమని కలెక్టర్ తెలిపారు. కల్వర్టుకు రెండు వైపుల సిబ్బందిని ఉంచి ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని ఎంపీడీఓ రమేష్ ను ఆదేశించారు. విద్యార్థులు, వృద్ధులు వాగు దాటే ప్రయత్నం చేస్తుంటారని ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదని ఆమె తేల్చి చెప్పారు. అవసరమైన ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని మక్తల్ తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రమేష్ లకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ ఉన్నారు.