మన న్యూస్,నిజాంసాగర్,( సంగారెడ్డి )సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నెల 13వ తేదీన ప్రాజెక్టు 11వ నంబర్ గేట్‌ను 1.50 మీటర్ల పైకెత్తి దిగువకు నీటిని వదలడం ప్రారంభించగా, ఈ నెల 15వ తేదీన 8,9 నంబర్ల గేట్లను పైకెత్తి ఈ మూడు గేట్ల ద్వారా 25433 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయితే ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింతగా పెరుగుతుండడంతో శనివారం మూడు గంటల వ్యవధిలోనే 6, 10 వ నంబర్ల గెట్లను పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మొత్తంగా 6,8,10,11,9, నంబర్ల గేట్లను 1.50 మీటర్లు,పైకెత్తి గేట్ల ద్వారా 43634 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 2180 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 60 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూసెక్కులు, హైదరాబాద్ వాటర్ బోర్డుకు 80 క్యూసెక్కులు, తాలెల్మ లిఫ్ట్‌కు 33 క్యూసెక్కులు, అవిరి రూపంలో 390 క్యూసెక్కులు, మొత్తంగా ప్రాజెక్టు నుంచి 43634 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు నుంచి దిగువకు రెండు టీఎంసీలు
ఈ వర్షాకాల సీజన్ ఆరంభం నుంచి సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు 2 టీఎంసీల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో ఈ నెల 13వ తేదీన ఒక గేట్‌ను ఓపెన్ చేసి దిగువకు నీటిని వదలగా, ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తుండడంతో ఐదు గేట్లను పైకెత్తి నీటిని వదులుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగితే మాత్రం మరిన్ని గేట్లను పైకెత్తి నీటిని వదిలే అవకాశం ఉందని అంటున్నారు."