చేళ్ళగురికి దేవస్థానాన్ని గవి మఠo ఆదర్శంగా తీసుకోవాలి
ఉరవకొండ మన న్యూస్ : 770 మఠాలకు మూలమఠం ఉరవకొండ గవి మఠం. గవిమఠంలో భక్తులు దాహంతో అలమటిస్తున్నారు. అయినప్పటికీ ఏజెంట్ గాని దేవదాయ శాఖ మేనేజర్ గాని భక్తుల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ ప్రతిరోజు భక్తులకు పదుల సంఖ్యలో మాత్రమే అన్నదానం చేస్తున్నారు. అయితే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. వృద్ధులు, వికలాంగులు అన్నార్తులు రోజు వస్తుంటారు. భోజన సమయంలో నీరు లేకపోవడంతో ముద్ద గొంతులో దిగక భక్తుల అవస్థలు వర్ణనాతీతం.
మఠ ఆవరణంలో రెండు తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా భక్తులకు దర్శనమిస్తున్నాయి. గవి సిద్దేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు దర్శనానికి ముందు శుచి శుభ్రత కోరుకుంటారు. కాళ్లు,చేతులు కడుక్కోవటానికి నీరు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అన్నదాన ఏర్పాటు విషయంలో పదుల సంఖ్యను మించడం లేదు : కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్నప్పటికీ, భూములు ఉన్నప్పటికీ అన్నదాన సౌకర్యం భక్తులకు అంతంత మాత్రమే. ఇది ఇలా ఉంటే ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో ఉన్న శ్రీ చేళ్ళగురికి ఎర్రి తాత దేవస్థానంలో వందలాదిమంది భక్తులకు నిత్యాన్నదానం సకల ఏర్పాట్లు చేస్తూ అక్కడ దినదిన ప్రవర్తమానంగా
విరాజిల్లుతోంది. అయితే ఇక్కడ ఉరవకొండ స్థితి, అన్నదాన పరిస్థితి, నానాటికి దిగదుడుపుగా మారింది. చెళ్ళ గురికి ఎర్రితాత దేవస్థానాన్ని ఆదర్శంగా, మార్గదర్శకంగా తీసుకొని అన్నదాన లోటు పాటు చర్యలు, దిద్దుబాటు చర్యల ఆవశ్యకత ఎంతో ఉందని భక్తులు కోరుకుంటున్నారు.
పరిసరాల అపరిశుభ్రత : సమాధుల దగ్గర అపరిశుభ్రత తాండవిస్తోంది. అయినా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం లో దేవస్థాన అధికారి చోద్యం చూస్తున్నారు. శుభ్రత పై దృష్టి సారించి అపరిశుభ్రతను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.