ఉరవకొండ, మన న్యూస్: ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి మంగళవారం ఇంటింటికి మేలుకొలుపు కరపత్రాలు పంపిణీ చేస్తూ, తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. "నీరు తరిగే నిధి – దాన్ని పదిలపరచటం మన విధి" అనే నినాదంతో సాగిన ఈ ప్రచారంలో, నీటి ఒక్క బొట్టూ వృథా కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. కరపత్రంలో, పట్టణంలో కొందరు తాగునీటిని వాహనాల శుభ్రం, రోడ్ల కడుగుట, కొత్త భవనాల క్యూరింగ్, పశువుల స్నానాల వంటి అవసరాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 20–30 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరిగిన సందర్భాలు గుర్తుచేసి, భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరారు. నీటి కొళాయిలకు మోటర్లు అమర్చిన వారు ఏడాదికి ₹10,000 వరకు అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, ఇప్పుడు నుంచే వృథా నీటి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.