ఎల్ బి నగర్. మన న్యూస్ :- హిమాయత్‌నగర్: అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవ వేడుకలు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ ఎదుట మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు సయ్యద్ వల్లీలా ఖాద్రి హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,దేశంలోనే ప్రథమ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఏర్పడి, నాటి నుంచి నేటి వరకు విద్యా రంగ సమస్యలు, సమానత్వం, శాస్త్రీయ విద్య కోసం పోరాటం చేస్తూ వస్తోంది. ఈ సంఘం నుంచి అనేక మంది విద్యార్థి నాయకులు దేశ సేవలో ముందువరుసలో నిలిచారు” అని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా, విద్యా రంగంలో పెద్దగా మార్పులు రాలేదని, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల లోపం, అనేక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన విమర్శించారు. తక్షణమే టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేసి, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఆలస్యమవడం వల్ల పేద విద్యార్థుల ఉన్నత విద్య కలగానే మిగిలిపోతుందని, కేజీ-టు-పీజీ ఉచిత విద్య వాగ్దానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఖాద్రి విమర్శించారు. “ప్రభుత్వ విద్యను కాపాడడం ఏఐఎస్ఎఫ్ ప్రధాన లక్ష్యం. ఈ 90వ వార్షికోత్సవం నినాదంతో ముందుకు సాగుతాం. స్పందించకపోతే బలమైన ఉద్యమాలతో పోరాటం చేస్తాం” అని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, ఏ ఐ వై ఎఫ్ హైదరాబాద్ కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్, ఏ ఐ ఎస్ ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చైతన్య యాదవ్, సహాయ కార్యదర్శి అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు ఉదయ్, రాష్ట్ర నాయకులు ఉప్పల ఉదయ్, మైముద్, పవన్, అజయ్, విప్లవ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.