మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )
బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల,జూనియర్ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన పాఠశాల ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటారు,తరగతి గదులు, టాయిలెట్స్,త్రాగునీటి సదుపాయాలను పరిశీలించారు.విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, డైట్ మెనూను పరిశీలించిన ఎమ్మెల్యే, వారితో కలిసి భోజనం చేస్తూ స్నేహపూర్వకంగా ముచ్చటించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం,మెరుగైన విద్య అందించాలంటూ ఉపాధ్యాయులకు సూచించారు.పాఠశాలలో సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని,చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మధ్యలో చదువులు ఆపకూడదని విద్యార్థులను ఉత్సాహపరిచారు.
చదువు ఒక్కటే మన జీవితాలను మార్చే శక్తి కలిగినది.ఇది సమాజంలో గుర్తింపు,గౌరవం ఇస్తుంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని కష్టపడి చదివి రాణించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.