మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లంకు చెందిన అబ్దుల్ మతీన్ పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు. చిన్నతనంలోనే తండ్రి అబ్దుల్ హమీద్‌ను కోల్పోయి, పినతండ్రి అబ్దుల్ మజీద్, అన్నయ్య అబ్దుల్ మాలిక్ పర్యవేక్షణలో పెరిగారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, చదువును మాత్రం ఎప్పుడూ వదల్లేదు.పిట్లం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే పేపర్ బాయ్‌గా పనిచేసి, జీవనాధారాన్ని సమకూర్చుకున్నారు. తరువాత హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో MBA, M.Com డిగ్రీలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక ప్రఖ్యాత డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.ఇటీవల “రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రవర్తనా అంశాల ప్రభావాన్ని అన్వేషించడం – హైదరాబాద్ పెట్టుబడిదారులపై ఒక అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేసి Ph.D. పట్టా అందుకున్నారు.ఈ పరిశోధన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషా కిరణ్ మార్గదర్శకత్వంలో పూర్తయింది.తన విజయంపై అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ.. తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. పేదరికం ఉన్నా కష్టపడితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చుఅని తెలిపారు. మతీన్ పట్టుదల, కృషి, పట్టింపు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.అబ్దుల్ మతీన్ డాక్టరేట్ సాధనపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.