మన న్యూస్,నెల్లూరు,ఆగస్టు 5:నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం లో స్థానిక 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ మరియు అతని అనుచరుల నుండిప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు పూల గురవయ్య ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువయ్య మాట్లాడుతూ.... కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ తల్లి దొరసానమ్మ వాళ్ళ అమ్మమ్మ సుబ్బమ్మ వాళ్ల ఇంటి పత్రాలు వాళ్ల వద్ద లేవని అవి ఎలా పొందాలని నన్ను అడిగారని తెలిపారు. మీ కుమారులను అడిగి తెప్పించుకోమని చెప్పినప్పటికీ ఆమె మరింత బ్రతిమిలాడడంతో నెల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంకు తీసుకెళ్లి ఆమెకు సంబంధించిన ఇంటి పత్రాలు ఇప్పించడం జరిగిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ ప్రసాద్ , అతని అనుచరులను మా ఇంటికి పంపించి నన్ను కారులో ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లారని బోరున విలపించారు. అనంతరం నన్ను స్థానిక అంజనాద్రి గెస్ట్ హౌస్ లో బంధించి నా చుట్టూ 20 మందికి పైగా అతని అనుచరులను కాపలా పెట్టి, నా మెడ మీద కత్తి పెట్టి నన్ను చంపేందుకు ప్రయత్నించినాడని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న నా భార్య పిల్లలు స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల చేత నా ఫోనుకు ఫోన్ చేయించి, పోలీసులు ఫోన్ చేయడంతో నన్ను తిరిగి మా ఇంటి వద్ద వదిలి వెళ్లారని, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నడుస్తుందని, కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ నన్ను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని , దీంతో నా కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ఈ విషయమై పోలీస్ యంత్రాంగం స్పందించి విచారణ జరిపి, నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నారు. ఈ సమావేశంలో బాధితులు పూల గురవయ్య, భార్య పూల సుగుణ, కుమార్తెలు పూల గురు లక్ష్మి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.