గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు ఒక టీకా లాంటిదని, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ పి. శివ జ్యోతి పేర్కొన్నారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం చెన్నూరు సెక్టార్ చెన్నూరు గిరిజన కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాన్ని సిడిపిఓ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ తల్లిపాల వారోత్సవాల్లో సూపర్వైజర్ శివ జ్యోతి పాల్గొని మాట్లాడుతూ తల్లి మురిపాలు బిడ్డకు ఆరోగ్యప్రతంగా కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందన్నారు. బిడ్డకు తల్లిపాలు ఇచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు బాలింతలకు అందించే పౌష్టికాహారం ఆరోగ్యానికి శ్రేష్టమని తెలిపారు.అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఉన్న బాలింతలు గర్భవతులు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏ కళ్యాణి, జయలక్ష్మి, గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు.