★ అక్కడ అలా… ఇక్కడ ఇలా!
ఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లా గవిమఠం సంస్థాన ఆవరణంలో పచ్చదనం తాండవిస్తుంది. జీవ సమాధి క్షేత్రాల ఎదుట, చుట్టుపక్కల డా. కరి బసవ రాజేంద్ర స్వామీజీ స్వయంగా పర్యవేక్షణలో పండ్లూ, పూలూ, ఔషధ మొక్కలూ నాటించి వాటి సంరక్షణ చేస్తున్నారు. ఈ చర్యలతో జీవ సమాధి ప్రాంతం ప్రకృతిశోభతో కళకళలాడుతోంది. అయితే, ఇదే సమయంలో మఠం ఇతర ప్రాంతాల్లో మాత్రం దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. పైన పటారం ఉండగా, లోపల మాత్రం లొటారంలా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మఠం బావి చుట్టూ చెత్త చెదారం పేరుతో దుర్వాసన వెదజల్లుతోందని, బావిలో నీటిమట్టం పెరుగుతున్నప్పటికీ పాచి, చెత్త తొలగింపులో నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. భక్తుల అభిప్రాయం ప్రకారం, బావిలోని నీటిని శుద్ధించి, మొక్కల పెంపకానికి వినియోగిస్తే ఆధ్యాత్మిక ప్రదేశం మరింత ప్రశాంతతను పొందుతుంది. అలాగే మఠం ఆవరణంలో ఓ చిన్న పార్కు ఏర్పాటు చేసి, ఔషధ మొక్కలను పెంచితే భక్తులకు ఆరోగ్యపరమైన ప్రయోజనాలూ కలుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి… గవిమఠంలో పచ్చదనానికి తోడు పరిశుభ్రతను కూడా సమపాళ్లలో కొనసాగిస్తే ఆ స్థలం భక్తులకే కాక ప్రకృతికీ పునీతమవుతుంది.