*మన న్యూస్ సింగరాయకొండ:-*పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాసామాగ్రి మరియు పోషకాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఇందుపల్లి జాషువా పుట్టినరోజు సందర్భంగా, ఆయన తాతయ్య అయిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్రాల ఇస్సాక్ రాజ భూషణం ఆర్థిక సహకారంతో, ఫ్రెండ్స్ స్వచ్చంద సంస్థ మరియు హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “గత 13 ఏళ్లుగా ఇస్సాక్ రాజ భూషణం గారు సింగరాయకొండ పరిధిలో గిరిజన విద్యార్థులకు అనేక విధాలుగా విద్యా సహాయం అందిస్తున్నారు. కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యాన్ని సామాజిక బాధ్యతగా భావించి, అవసరమైన చిన్నారులకు అవసరమైన ఉపకరణాలు, ఆహార పదార్థాలు అందించడం గొప్ప విషయమని” ప్రశంసించారు.అలాగే, “అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ, అవి గిరిజన ప్రాంత ప్రజలకు పూర్తిగా అందటం లేదని, కనీస అవగాహనలేమి కారణంగా వారు అభివృద్ధికి నోచుకోవడం లేదు. సింగరాయకొండ పరిధిలోని కొన్ని గిరిజన కాలనీల్లో విద్యార్థులు 10వ తరగతి కూడా పూర్తి చేయలేకపోతున్నారు. వలసల జీవనశైలి చిన్నారుల చదువుకు అడ్డంకిగా మారుతోంది” అని తెలిపారు.చిన్నారులు మధ్యలోనే బడిని మానేస్తున్న సందర్భాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి గ్రామాల్లో విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని కత్తి మాధురి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.