రక్తహీనత దూరం ప్రగతి సంస్ధ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ,ఏఏఆర్ స్టేడియంలో గోధుమ గడ్డి జ్యూస్ సేవనంపై అవగాహన
గూడూరు, మన న్యూస్ :- గోధుమ గడ్డి ఆరోగ్య సంజీవని అని ప్రముఖ యోగా మాస్టర్ రాజా అన్నారు. బుధవారం గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్యాలిబర్ ఎవర్ గ్రీన్ గ్రాస్ ప్రయివేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం హిమాలయాల్లో ఉన్న తన గురువు ధ్యానం బాబా గోధుమగడ్డి ప్రయోజనాలను వివరించారని, తాను కూడా ఉపయోగించి ఆరోగ్యంగా ఉంటున్నానని తెలిపారు. 2వేల ఏళ్ల క్రితమే గోధుమ గడ్డి విశిష్టతను ఆయుర్వేదంలో వివరించినట్లు తెలిపారు. గోధుమ గడ్డి జ్యూస్ సేవనంతో శరీరంలో మలినాలు విసర్జించబడతాయన్నారు. రక్తం పలుచబడి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందన్నారు. క్యాన్సర్ రాకుండా అరికడుతుందన్నారు. ఏడాది పిల్లల నుండి వృద్ధుల వరకూ గోధుమ గడ్డి జ్యూస్ ను సేవించవచ్చన్నారు. ఆదాయం అంతగా లేకపోయినా సేవా దృక్పథంతో ప్లాంట్ ఏర్పాటు చేసి హెల్తీ గూడూర్ హెల్తీ పీపుల్ అనే మంచి ఆశయం, చక్కటి నినాదంతో ముందుకొచ్చిన క్యాలిబర్ ఎవర్ గ్రీన్ వీట్ గ్రాస్ సంస్థ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ప్రగతి సేవా సంస్ధ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితానికి అద్భుతమైన వరం గోధుమ గడ్డి అన్నారు. తమ సంస్థ తరపున పట్టణ ప్రజలకు గోధుమ గడ్డి సేవనంతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. క్యాలిబర్ ఎవర్ గ్రీన్ గ్రాస్ ప్రయివేట్ లిమిటెడ్ నిర్వాహకులు షేక్ జమాల్ అహ్మద్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఆర్ అండ్ డీ చేస్తూ వంద శాతం హైజనిక్ ఆర్గానిక్ గోధుమ గడ్డి, జ్యూస్ కాన్సర్ట్రేట్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. తయారీ విధానం, వ్యయం, జ్యూస్ సేవించే విధానాన్ని వివరించారు. అనంతరం స్టేడియంలో వాకర్స్ కు వీట్ గ్రాస్ జ్యూస్ ను అందించారు. ఎంతో టేస్టీగా ఉందని వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు షఫీ మోలానా, షేక్. జమాలుల్లా, వలీ, ప్రగతి సేవా సంస్థ సభ్యులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.