మన న్యూస్, నారాయణ పేట జిల్లా : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఎత్తినందున పై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్నందున మరియు జూరాల డ్యాం నుండి 12 గేట్లు ఎత్తినందున నారాయణపేట జిల్లా, కృష్ణా మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణ ఎస్సై ఎస్ ఎం నవీద్ తెలిపారు.బుధవారం ఉదయం కృష్ణ ఎస్సై కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున నది పరివాహక ప్రాంత ప్రజలు,కృష్ణ మండలం, గుజ్రాల్, హిందూపూర్, వాసు నగర్, ముడుమల్ మొదలగు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి కృష్ణానది లోకి చేపలు పట్టడానికి, ఇతర పొలం పనులకు, పశువులను మేపడానికి వెళ్లరాదని అన్నారు.పిల్లలు సరదాగా ఈత కొట్టడానికి, సెల్ఫీ ఫోటోలు దిగడానికి వెళ్లరాదని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో సంబంధిత పోలీసు అధికారులకు లేదా డయల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.