శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, వివరించలేని బరువు తగ్గడం, అధిక అలసట, దృష్టి మసకబారడం, గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మరియు తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వంటివి లక్షణాలు కలిగి ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ చిత్రారెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామంలో అన్నవరం నకు చెందిన సత్య సింహ షుగర్ ఆసుపత్రి యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామీణవాసులు వైద్య సేవలు పొందారు. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ చిత్రారెడ్డి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు చిత్రరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణవాసులకు సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.షుగర్ వ్యాధి (మధుమేహం) నివారణకు లేదా నియంత్రణకు సులభ చికిత్స అనేది లేదు, కానీ కొన్ని జీవనశైలి మార్పులు మరియు వైద్య పర్యవేక్షణతో దానిని నిర్వహించవచ్చని, సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, మరియు వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు అన్నారు. అనంతరంఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణవాసులకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్య సింహ సుగర్ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, రమణ, ఆశ, మాధవి, ఆసుపత్రి యాజమాన్య సిబ్బంది నాని, లోవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.