నూతన జాతీయ విద్యా విధానమే పీఎం శ్రీ పాఠశాలల లక్ష్యం..!!
కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
కలిగిరి మండల కేంద్రంలోని మోడల్ హైస్కూల్ బెస్ట్ పి యం శ్రీ పాఠశాలగా ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మోడల్ స్కూల్ ను బెస్ట్ పి ఎం శ్రీ స్కూల్ కింద మార్చడం పట్ల, హర్షం వ్యక్తం చేస్తూ, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
మంగళవారం కలిగిరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ముందుగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి విద్యార్థులు అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పీఎం శ్రీ పాఠశాలలో అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ఈ పథకం కింద ఏర్పాటు చేసిన పాఠశాలలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు, కేంద్రీయ విద్యాలయ సంఘటన మరియు నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 14,500 స్కూల్ లను ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 623 పాఠశాలలో ఎంపిక అయ్యాయి అన్నారు. ఈ పాఠశాలల లక్ష్యం నాణ్యమైన విద్యను అందించడం మరియు వారిలో అభివృద్ధిని పెంపొందించడం, నూతన జాతీయ విద్యా విధానం అందించడం, అన్ని వనరులను సమకూర్చడం, సురక్షితమైన మరియు ఉత్తేజపరిచే అభ్యాస వాతావరణాన్ని కలిగించడం వీటి లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో మొత్తం నాలుగు మోడల్ స్కూల్ ఉండగా కలిగిరి మోడల్ స్కూల్ బెస్ట్ పి ఎం శ్రీ పాఠశాలగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో, మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రావుల కొల్లు సర్పంచ్ పీవీ నాయుడు, కాకి మహేష్, మధు మోహన్ రెడ్డి, సర్పంచ్ వెంకటసుబ్బయ్య, చీమల తాతయ్య, బి శ్రీనివాసరావు, ఇతర నాయకులు, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.