మన న్యూస్ సింగరాయకొండ:-
పిల్లల భద్రత, మహిళల రక్షణ మరియు సైబర్ మోసాలపై అవగాహన కల్పించే దిశగా శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ IPS గారి స్వీయ పర్యవేక్షణలో, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య గారి సమన్వయంతో జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలు, డయల్ 100/112 సేవలు, మరియు ముఖ్యంగా గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ మధ్య తేడా, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు, స్వీయ రక్షణ పద్ధతులు, వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.అలాగే యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, ఫేక్ లోన్ యాప్స్, కేవైసీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు వంటి విషయాలను వివరించారు. సోషల్ మీడియా యాప్లు, వాట్సాప్లో ఫేక్ లింకుల ద్వారా జరుగుతున్న మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ, “సీఐ గారు విద్యార్థులకు అందించిన సమాచారం ఎంతో విలువైనది. ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించి సమాజంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలని” తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.