ఉరవకొండ, మన న్యూస్ :ఉరవకొండ మండల పరిధిలోని వ్యాసాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ కె. సీతారాములు గారికి అరుదైన గౌరవం దక్కింది. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటలో జరిగే జాతీయ వేడుకలకు హాజరయ్యేలా కేంద్రం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ పిలుపుతో గ్రామంలో ఉత్సాహానికితప్ప మరొకటి కనిపించలేదు. గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ తమ గ్రామం పేరు ఇప్పుడు "గల్లీ నుంచి ఢిల్లీ" దాకా మార్మోగుతోందంటూ గర్వంతో తెలిపారు.
సర్పంచ్ సీతారాములు గురించి మాట్లాడుతూ, "ఆయనంటే ప్రజలకు ప్రాణం – ప్రజలంటే ఆయనకు అంతే మక్కువ" అని గ్రామస్తులు అంటున్నారు. దీర్ఘకాలంగా టీడీపీ నేతలైన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరులు పయ్యావుల శ్రీనివాసుల శిష్యత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న సీతారాములు, గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందు ఉంటారు. వారి మద్దతుతో అనేక నిధులను సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ, “ఇది వ్యక్తిగత గౌరవం కాదు – ఇది మా గ్రామ ప్రజల ప్రతిష్ట. ఈ ఘనతకు కారణమైన ప్రజలకూ, పయ్యావుల సోదరులకూ నేను జీవితాంతం రుణపడి ఉంటాను,” అని ఉద్వేగంగా తెలిపారు. ఈ అరుదైన అవకాశం వ్యాసాపురం గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని స్థానికులు పేర్కొన్నారు.