నర్వ జులై 27 మన న్యూస్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం తెలపాలని నర్వ మండల బీసీ కుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నర్వ మండల కేంద్రంలోని బీసీ కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఐలయ్య యాదవ్, చెన్నయ్య సాగర్, నీరాజ్, గడ్డం నరసింహ తదితరులు మాట్లాడుతూ, “ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంటుకు పంపింది. ఇప్పుడు ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి” అన్నారు.బీసీలకు ఇప్పటివరకు విద్య, ఉద్యోగ రంగాల్లో తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల అనేక నష్టాలు వాటిల్లాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేధావుల లెక్కల ప్రకారం బీసీల జనాభా 42 శాతంగా ఉండటమే ఈ రిజర్వేషన్ తీర్మానానికి ఆధారం అని పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిగా గెలిచి మొదటిసారిగా బీసీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇది బీసీ వర్గానికి ఒక గౌరవంగా భావించాల్సిన సందర్భమని వారు అభిప్రాయపడ్డారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ పార్లమెంటులో బీసీల తరఫున నిలబడి, ఈ 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని కోరారు. ఈ సమావేశంలో యాంకి కురుమూర్తి, శ్రీకాంత్ రెడ్డి వెంకట్రాంరెడ్డి, ఎండి ఫజల్, ఎండి రఫీ, గొల్ల మొయిలప్ప, రామచంద్రి, సతీష్ గౌడ్ తదితర గ్రామాల బీసీ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు..