గొల్లప్రోలు, మన న్యూస్ :- పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారుస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అక్రమ వ్యాపారులను ప్రోత్సహిస్తే సహించేది లేదని పవన్ బహిరంగంగా హెచ్చరించినప్పటికీ ఆయన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలవారి మామూళ్లకు అలవాటు పడి పవన్ ప్రతిష్టను మసక భారుస్తున్నారని మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం చెందుర్తి శివారు 16వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకొని విచ్చలవిడిగా అక్రమ ఆయిల్, ఐరన్ దుకాణాలు ఏర్పాటు అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని నెలల నుండి అక్రమ ఐరన్, ఆయిల్ దుకాణాలు ఏర్పాటు చేసి వాహనాల నుండి డ్రైవర్ల సహకారంతో ఆయిల్, ఐరన్ చోరీ చేస్తున్నా అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. చెందుర్తి,వన్నెపూడి శివారులో జాతీయ రహదారి ఆనుకొని రహదారిని ఆనుకొని అక్రమంగా ఆయిల్ దుకాణాలు, ఐరన్ దుకాణం ఏర్పాటుచేసి బహిరంగంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ వ్యాపారాలను అధికారులు ప్రోత్సహించినా, అక్రమార్కులకు సహకరించినా సహించేది లేదని ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ అధికారులను హెచ్చరించినా అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గొల్లప్రోలు మండల పరిధిలో జాతీయ రహదారిపై గతంలో ఎన్నడూ అక్రమ ఐరన్, ఆయిల్ దుకాణాలు లేవని ప్రస్తుతం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అక్రమ వ్యాపారాలు రోజురోజుకు విస్తరిస్తుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వ్యాపారులు సంబంధిత అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్ట చెబుతుండడంతో అక్రమ దుకాణాలను ఆదాయ వనరులుగా భావించి కొంతమంది అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారని, ఇతర ప్రాంతాల్లో అక్రమ వ్యాపారాలు చేసేవారిని సైతం తమ పరిధిలో వ్యాపారం చేసుకుంటే సహకరిస్తామంటూ పిలుస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చెందుర్తి, వన్నెపూడి జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన అక్రమ ఆయిల్, ఐరన్ దుకాణాలను నిరోధించాలని, అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.