మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే జీవితాలు పోలీసులవి. మిగతా ఉద్యోగుల్లా పిల్లలకు, కుటుంబానికి సమయం ఇచ్చి గడిపే అవకాశం చాలా అరుదు. పోలీసు స్టేషనే ఇల్లు, కుటుంబం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా కుటుంబ సభ్యుల్లా ఒకరికి ఒకరు తోడుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచింది మక్తల్ పోలీసు స్టేషన్. నిండు గర్భిణిగా ఉండి విధులు నిర్వహిస్తు సెలవుల్లో వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ కు పోలీసు అధికారులు, సిబ్బంది తమ పోలీసు స్టేషన్ లోనే చీర, పూలు, పండ్లు పెట్టీ ఘనంగా సత్కరించారు. ఆ మహిళా కానిస్టేబుల్ ను అందరూ కుటుంబ సభ్యుల మాదిరిగా దైర్యం చెప్పారు. మక్తల్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న చైతన్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి ఉండి సెలవులపై వెళ్తున్నందున పోలీసు స్టేషన్ లో శుక్రవారం సీఐ రామ్ లాల్, ఎస్.ఐ. భాగ్య లక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఎస్.ఐ. రేవతి, పోలీసు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఎప్పుడూ విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు, కేసులతో హడావిడిగా ఉండే పోలీసు స్టేషన్ లో తాను పని చేసే పోలీసు స్టేషన్ లోనే తనకు ఉన్నతాధికారుల సమక్షంలో ఘనంగా సన్మానించడంతో ఆ మహిళ కానిస్టేబుల్ ఆనందపడింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.