అనంతపురం జిల్లా మన న్యూస్:- కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి చీకటి ఛాయలు తెరుచుకున్నాయి. కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామిపై ఫిర్యాదులు రావడంతో, అతనిపై ఎప్పటినుంచో కన్నేసిన ఏసీబీ అధికారులు చివరికి ట్రాప్ వేసి పట్టుకున్నారు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిని రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ స్థిరాస్తి వ్యాపారి నాగేంద్ర నుంచి రిజిస్ట్రేషన్ క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం.
ఈ ఘటనతో కల్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద హడావుడి నెలకొంది. ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులే లంచాలకోసం చేతులు చాపుతుండటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నారాయణస్వామిని ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.