మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అసోసియేట్ కుంచాల భాస్కరరావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఫోలిక్ ఆసిడ్ కలిగిన సన్నబియ్యం, ఫోర్టిఫైడ్ రైస్, అయోడిన్ ఉప్పు వంటివి తప్పనిసరిగా వినియోగించాలన్నారు. ఫోర్టిఫైడ్ రైస్ లో సూక్ష్మపోషకాలు ఉండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, ఐరన్ కలిగిన బెల్లం, రాగి జావ రక్తహీనత నివారణకు తోడ్పడతాయని వివరించారు. అలాగే, విటమిన్ B12 నాడీ వ్యవస్థ, రక్త ఉత్పత్తికి అవసరమని, ఫోర్టిఫైడ్ ఆయిల్ లో ఉండే విటమిన్ A, Dల వల్ల కీళ్లనొప్పులు, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు.ఈ సందర్భంగా సంబంధిత పోషక విలువలపై అవగాహన కల్పించే F+ పోస్టర్లు పాఠశాల నిర్వాహకులకు అందజేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ సూచనల మేరకు మెనూ అనుసరిస్తూ నిత్యం విద్యార్థులకు చిక్కి, రాగి జావ, కోడిగుడ్డు వంటి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరూ పాఠశాలలోనే భోజనం చేస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్ చౌదరి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ వాణి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు పద్మ పాల్గొన్నారు.