
మన న్యూస్,నెల్లూరు, జూలై 20:ఘనంగా గాండ్ల తెలికుల కులస్థుల ప్రతిభా పురస్కారాల అందజేత- ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం- పోటీతత్వం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపతాయి నెల్లూరుఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, ప్రతి నిత్యం పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని పరమేశ్వరీ కల్యాణ మండపంలో అఖిల గాండ్ల, తెలికుల కులస్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు సహాయ సహకారాలతో 10, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేతలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం గాండ్ల కులానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..... గాండ్ల తెలికుల కులస్థులలో 10, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అఖిల గాండ్ల, తెలికుల కులస్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేశారు. అవార్డులు అందిస్తూ విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని ప్రోత్సహిస్తున్న సంఘ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రోసు గోపాలయ్య, అనంతరం ఆయన కుమారుడు సుబ్బారావు అసోసియేషన్ తరఫున మంచి సేవలు అందిస్తున్నారని చెప్పారు. తనకు చదువు అంటే ఎంతో ఇష్టమని, అందుకే పేద పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. గాండ్ల కులస్థుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు గారు, నారా లోకేష్ కట్టుబడి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా గోపాలయ్య తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వృద్ధాశ్రమంలో తాను చేసిన కార్యక్రమాలను వివరించారు. గాండ్ల, తెలికుల కులాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున ఏం చేయగలమో చేస్తామని స్పష్టం చేశారు.డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించేలా అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కులాన్ని బలోపేతం చేసుకుంటూనే వారికి ప్రోత్సాహకాలు అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు మాట్లాడుతూ...... విద్యార్థులను ప్రోత్సహించేందుకు క్రమం తప్పకుండా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. సుమారు 31 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి స్థాయికి రావాలన్నారు.ఈ కార్యక్రమంలో గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గిద్దలూరు ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి హర గోపాల్, కుల సంఘ నాయకులు, టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, గుడి హరిరెడ్డి, ముంగమూరు చైతన్య, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.





