పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితుడి ఆవేదన
న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని భూమిని అక్రమంగా 15 రోజుల క్రితం ఇతరులు కబ్జా చేసుకుని వరి నాటు వేసుకున్నారని ఆ భూమిని రక్షించాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగట్లేదని బాధితుడు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి వివరాల ప్రకారం…ధరూరు మండలం వామన్ పల్లి గ్రామానికి చెందిన ఊరబాయి మద్దిలేటి అనే వ్యక్తికి ఉప్పేరు శివారులోని సర్వే నంబర్ 588 లో వ్యవసాయ భూమి ఉంది. అయితే అదే పొలం పక్క ఉన్న అదే గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా నాకు సంబంధించిన భూమిని దౌర్జనంగా కబ్జా చేసుకున్నారని తెలిపారు. రాత్రికి రాత్రి జేసీబీ ద్వారా నా భూమిలో వరాలు వేసి కబ్జా చేసుకుని అందులో ఇప్పుడు వరి నాటు వేసుకున్నాడని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని, నా భూమిని అక్రమంగా కబ్జా చేసుకున్న దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకొని నా భూమిని రక్షించి తమకు న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారులను వీడియో ద్వారా వేడుకున్నారు.