మన న్యూస్ చిత్తూరు జులై-18
భవిష్య నిధి రుణాలు, తుది మొత్తాల చెల్లింపులు వేగవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్.టి.యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ ,చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదన్ మోహన్ రెడ్డి, బోడే మోహన్ యాదవ్ , చిత్తూరులో జడ్పీసి.ఇ.ఓ రవికుమార్ నాయుడు ను కలసి, వినతి పత్రం సమర్పించి, వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా, ఎస్టియు నాయకులు మాట్లాడుతూ, పదవీ విరమణ వారికి చెందిన వారికి తుది మొత్తాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిపిఎఫ్ తరహాలో జెడ్పిపిఎఫ్ ఖాతాదారులకు కూడా ప్రతి నెల, పిఎఫ్ చందాల జమలకు సంబంధించి ఎస్ఎంఎస్ సౌలభ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మిస్సింగ్ క్రెడిట్స్ నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కారుణ్య నియామకాలు వేగవంతం చేయాలని కోరారు. జడ్పీ సీఈవో మాట్లాడుతూ, రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే చిత్తూరు జిల్లాలో భవిష్య నిధి ఖాతాల నిర్వహణ మెరుగ్గా నిర్వహించడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. పిఎఫ్ రుణాలు, తుది మొత్తాల చెల్లింపులు జాప్యం నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు స్పందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టియు నాయకులు లింగమూర్తి,చంద్రన్, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.