శంఖవరం/ కాకినాడ మనన్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం నుంచి వేళంగికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సును పునరుద్దరించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావును జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షుడు రామ్ కుమార్ చిలుకూరి గురువారం కోరారు. కాకినాడ ఆర్టీసీ కార్యాలయంలో శ్రీనివాసరావును కలిసిన రామ్ కుమార్, పార్టీ నేతల బృందం ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయనతో రామ్ కుమార్ మాట్లాడుతూ... గతంలో సుమారు 10 ఏళ్ళ క్రితం వరకూ తుని, కాకినాడ ఆర్టీసీ డిపోల నుంచి శంఖవరం నుంచి గౌరంపేట, శృంగధార, పెదమల్లాపురం మీదుగా వేంగి గ్రామానికి 19 కిలో మీటర్ల దూరం పొడవునా ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణా సేవలను అందించేవని చెప్పారు. అయితే అనంతరం కాలంలో రోడ్డు బాగా ధ్వంసమైన నేపధ్యంలో బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఈ రోడ్డును ఆర్నెల్ల క్రితం పునర్నిర్మించి నప్పటికీ కూడా ఇంకా బస్సును పునరుద్దరించలేదని రామ్ కుమార్ గుర్తుచేశారు. గిరిజన కు గ్రామాల ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసులను యధావిధిగా పునరుద్ధరించాలని రాంకుమార్ బృందం కోరింది. బస్సులను పునరుద్ధరించడానికి ఉన్న అన్ని అవకాశాలనూ అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు సానుకూలంగా ప్రతిస్పందించారు. ఈ కార్యక్రమంలో రంభాల వెంకటేశ్వరరావు, బొలిశెట్టి రామకృష్ణన్, పెండెం బాబ్జీ, సలాది నాయుడు తదితరులు రాంకుమార్ వెంట ఉన్నారు.