_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ నికోడమస్ స్లెస్సర్ బాబు పేర్కొన్నారు. నేటి ఆధునిక సమాజంలో విద్యార్థులు అనేక ఒత్తిడులను ఎదుర్కొంటున్నారని, వారికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి మంచి మార్గనిర్దేశం, సమిష్టి సహకారమే వారిని విజయపథంలో నడిపించగలదని ఆయన పేర్కొన్నారు. సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెఫరల్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0" - ఆత్మీయ సమావేశాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మధ్యాహ్నం 2 గంటలకు ముగిసిన ఈసమావేశంలో తల్లి, దండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని ఉపాధ్యాయులతో తులనాత్మకంగా సమీక్షించారు. విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్లు, అభ్యాసన శైలి, బలాలు, బలహీనతలు మెరుగు పరచాల్సిన అంశాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరంగా వివరించారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై మార్గదర్శకాలను అందించారు. విద్యార్థులు బడి నుండి ఇంటికి చేరాక గడపవలసిన సమయాన్ని సద్వినియోగం చేసేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు తల్లిదండ్రులకు మార్గదర్శకాలను సూచించారు. సాంఘిక మాధ్యమాల ప్రభావం, పాఠశాల శ్రద్ధ, స్నేహితుల మధ్య అనుబంధం, అనుసంధానం, నైతిక విలువలు, ఒత్తిడి నిర్వహణ వంటి అంశాలపై చర్చలు జరిపారు. పిల్లల్లో నైతిక బోధ, సున్నితమైన భావోద్వేగాలు, చదువుపై శ్రద్ధ, భవిష్యత్ లక్ష్యాలు తదితర విషయాల్లో తల్లిదండ్రులు చూపవలసిన సహకారంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఆహూతులైన తల్లిదండ్రులను ఉద్దేశించి ముఖ్య అతిథి చైర్మన్, కరస్పాండెంట్ నికోడమస్ స్లెస్సర్ బాబు మాట్లాడారు. కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో తమ రిఫరల్ స్కూల్‌ను తీర్చిదిద్దామని, తమ పాఠశాలలపై తల్లిదండ్రులు తమ నమ్మకాన్ని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు. రిఫరల్ డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాన బాధ్యత కలిగివుంటారని అన్నారు. ఈ సమావేశాల ద్వారా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య అనుబంధం పెరిగి, విద్యార్థుల అభ్యాసంలో మెరుగుదల సుసాధ్యం అవుతుంది అన్నారు. వెనుకబడిన విద్యార్థుల గ్రేడ్స్ మెరుగు పరచడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు, వారపు ప్రోగ్రెస్ రిపోర్ట్లు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించ నున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ... మనమందరం కలిసి పనిచేస్తే, మన పిల్లల భవిష్యత్తును బంగారు బాటలో నడిపించవచ్చు అన్నారు. తల్లి దండ్రుల సహకారంతో స్కూల్ ఇంకా మంచి విజయాలు సాధించ గలదని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా తల్లి దండ్రులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.