కలిగిరిమన న్యూస్ : కలిగిరి ప్రాథమిక వైద్యశాల డాక్టర్లపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని కలిగిరి మండల అధ్యక్షురాలు ముట్టుకూరు శిరీష రెడ్డి ఎంపీడీవో ప్రత్యూషను కోరారు. కలిగిరి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ప్రత్యూష అధ్యక్షత వహించగా ఎంపీపీ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్నీ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రాదేశిక సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు పాల్గొనాల్సి ఉంది. అయితే బుధవారం జరిగిన కార్యక్రమానికి అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ మొక్కుబడిగా హాజరై మండల సమావేశం జరిగిందని పంపించారు. ఆశించిన స్థాయిలో సభ్యులు హాజరు కాలేదు. ఇది ఇలా ఉంటే కలిగిరి ప్రాథమిక వైద్య కేంద్రాన్ని 24 గంటల వైద్యశాలగా మార్చి అక్కడ ఇద్దరు డాక్టర్లను తగినంతమంది సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. అయితే గత మూడు సర్వసభ్య సమావేశాల నుండి కలిగిరి వైద్యాధికారులు సమావేశాలకు హాజరు కాకుండా వారి సిబ్బందిని మాత్రమే సమావేశాలకు పంపుతున్నారని దీనివలన సమావేశంలో వివరించాల్సిన అంశాలను వైద్యాధికారి రానందువలన ప్రజాప్రతినిధులకు చేరవేయలేకపోతున్నామని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాలలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్న సమావేశాలకు డుమ్మా కొట్టడం ఏంటని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైద్యాధికారి విధులకు సైతం సక్రమంగా హాజరు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయని ఎంపీపీ మండిపడ్డారు. వైద్యాధికారులు విధులకు హాజరు కాకుండానే సంతకాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలాంటి అధికారిపై వెంటనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలంటూ ఎంపీడీవో కి తెలిపారు. అదేవిధంగా సర్వసభ్య సమావేశానికి హాజరు కానీ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండి వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు గ్రామాల్లో తిరగాలని ప్రజలకు కూడా ఇళ్లల్లో నీటిని నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందజేయాలని వ్యవసాయ అధికారులకు తెలియజేశారు.